రహదారి ప్రమాదంలో చింతలపూడి ఎస్సై దంపతులు దుర్మరణం చెందారు.ఈ ప్రమాదం లో సురక్షితంగా బయటపడిoది15 నెలల చిన్నారి. ఆదర్శం వివాహం చేసుకొని ఆన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు, వీరిద్దరి కలల పంటగా ముద్దులొలికించే 15నెలల చిన్నారి. ఎంతో హాయిగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. రహదారి ప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు ఆ దంపతులను బలితీసుకొంది. లింగపాలెం మండలం సీతమ్మచెరువు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదానాయక్ (34) ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలైన ఆయన భార్య శాంతి (29) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చింతలపూడి ఎస్సైగా పనిచేస్తున్న బానోతు సైదానాయక్, ఆయన భార్య శాంతిలు కుమార్తె ప్రిన్సీ (సుదీప)ని తీసుకొని కారులో శనివారం ఏలూరు బయలుదేరారు. సైదానాయక్ స్వయంగా కారు నడుపుతున్నారు. లింగపాలెం మండలం సీతమ్మచెరువు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈఘటనలో సైదానాయక్‌కు బలమైన గాయాలు కాగా ఘటనా స్థలంలోనే మృతిచెందారు. తీవ్ర గాయాలైన ఆయన భార్య శాంతిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆశ్రం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం శాంతి మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి ప్రిన్సీకి ఎలాంటి గాయాలు కాకపోవటం వూరట కలిగించే అంశం. కాగా ఈ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.
మరణంలోనూ వీడని బంధం..
సైదానాయక్, శాంతి దంపతులది ప్రేమ వివాహం. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని కటుంబ సభ్యులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఎంఏ బీఈడీ చేసిన సైదానాయక్ బీఈడీ తాడేపల్లిగూడెంలో చదివారు. అదే సమయంలో మిలటరీ మాధవరానికి చెందిన శాంతి కూడా అదే కళాశాలలో బీఈడీ చదివారు. అక్కడే వీరి మనసులు కలవడంతో కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తరువాత ఏలూరు వైపు నుంచి చింతలపూడి వెళుతున్న సుందరరావుగూడేనికి చెందిన కె.జార్జి, శ్రీనివాసరెడ్డిలు తొలుత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన కారు డోరు తీశామని సైదానాయక్ భార్య శాంతి తీవ్రగాయాలతో ఉండగా, పాప ఏడుస్తున్నట్లు వీరు చెప్పారు. పాపను ఎత్తుకుని తొలుత శాంతిని, తరువాత సైదానాయక్‌ను బయటకు తీశామని.. అప్పటికే సైదానాయక్ చనిపోయినట్లు చెప్పారు. అప్పుడు ఆయన ఎస్సై అని తమకు తెలియదని వీరు చెబుతున్నారు.
Comments
Post a Comment